1 మే 2011, ఆదివారం ఆంధ్రజ్యోతి అనుబంధంలో ప్రచురితం

మేధావులు, తలలు పండిన మాలాంటివారు చేయాల్సిన పనిని అంగబలం, అర్థబలం లేని ఒక అనామకుడు చేస్తే ఒళ్ళు మండదా! మొన్నీమధ్య హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీలో అదే జరిగింది.

రంగస్థల దినోత్సవం సందర్భంగా పాతికేళ్లు కూడా లేని వగ్గు రఘువీర్ అనే మహబూబ్‌నగర్ కుర్రాడు ఒక నాటకం వేశాడు. అదే యూనివర్సిటీలో ఎం.ఎ. నాటకాల కోర్సు చేసి, ఉద్యోగం, సద్యోగం లేక, అక్కడే చెట్ల దగ్గరా, కాంటీన్ దగ్గరా టీలు తాగుతూ కాలక్షేపం చేసే ఆ కుర్రాడు గతంలో తలాతోకా లేని నాటకాలు చాలానే వేశాడు గాని ఏదీ ఎవరికీ నచ్చలేదు. ప్రేక్షకుల సంగతి అలా ఉంచండి! చిత్రమేమిటంటే అతనిక్కూడా అవి నచ్చేవి కావు. అందుకేనేమో ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనం కోసం, పరిపూర్ణత కోసం ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. అతను అలుపెరగకుండా చేసిన ఈ అభ్యాసం ఈసారి ప్రదర్శించిన నాటకంతో ఒక పరిపూర్ణతనీ, స్పష్టతనీ సంతరించుకుని ఆడిటోరియంలో కూర్చొన్న ప్రతి ఒక్కళ్ళనీ మంత్రముగ్ధుల్ని చేసింది.

నాటకం చూడ్డానికొచ్చిన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భట్టు రమేష్. జయధీర్ తిరుమల్రావ్, చాట్ల శ్రీరాములు, దుగ్గిరాల సోమేశ్వర్రావు లాంటి వాళ్ళు రఘువీర్ని పొగడ్తలతో ముంచేస్తుంటే అబ్బా! ఈ నాటకాన్ని నేను డైరెక్ట్ చేసుంటే ఆ పొగడ్తలన్నీ నాకే దక్కేవిగదా అని కాస్త కుళ్ళుకున్నాను కూడా.

రఘువీర్ డైరెక్ట్ చేసిన నాటకం పేరు ‘ఎకనమిక్ హిట్‌మాన్’. అసలు అది నాటకమే కాదు. ఒక ఆటోబయోగ్రఫీ. జాన్ పెర్కిన్స్ అనే అమెరికన్ రాసిన “Confessions of an Economic Hitman” అనే ఆత్మకథను తెలుగులోకి కొణతం దిలీప్ ‘ఒక దళారీ పశ్చాత్తాపం’ పేరుతో ఐదేళ్ల క్రితం అనువదించారు. ఈ ఐదేళ్ళలోనే అది దాదాపు పదిసార్లు పునర్ముద్రణ పొందింది. ఆ రచయిత జాన్ పెర్కిన్స్ ప్రపంచ బ్యాంకులో అతి కీలకమైన అధికారిగా పనిచేశాడు. అభివృద్ధి చెందని, చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం చేస్తున్నామనే పేరుతో ప్రపంచ బ్యాంక్ ఆయా దేశాలని ఎంత దారుణంగా దోచుకుంటున్నదో వివరించే పుస్తకం ఇది.

దోపిడీ, కుట్ర, సామ్రాజ్యవాదం… ఇలాంటి మాటలు గత పదిహేనేళ్లుగా మన వామపక్ష నాయకులు, మేధావులు పదేపదే మాట్లాడుతున్నప్పటికీ వీళ్లెప్పుడూ ఇంతే! ప్రతిదీ నెగెటివ్‌గానే చూస్తారు అని కొట్టిపడేసేటట్టుగా ఉండేవి వారి మూస పదధోరణీ, ప్రసంగధోరణీ. అయితే అవే విషయాలు జాన్ పెర్కిన్స్ ఈ పుస్తకంలో రాస్తే పేజీ పేజీకీ ఉత్కంఠ, ఉలికిపాటు, కొన్నిసార్లు గగుర్పాటు కలుగుతాయి. అందుకు కారణం ప్రపంచ బ్యాంకు లక్షల కోట్ల లాభాలు ఆర్జించడానికి కారణమైన ఆ అతి ముఖ్యమైన అధికారి జాన్ పెర్కిన్స్ ‘నేను చేసింది తప్పు… ఇది ఒక కుట్ర’ అని వినమ్రంగా పశ్చాత్తాపపడటం. అభివృద్ధి చేస్తాం, దానికి కావలసిన ఆర్థిక సహాయం చేస్తాం అంటూ ఎలాంటెలాంటి కుయుక్తులతో ప్రపంచ బ్యాంకు రంగప్రవేశం చేస్తుందో, అది రంగం మీదికొచ్చాక, ఒక్కో ఎత్తుగడతో ఒక్కో రంగాన్ని ఎలా కబళిస్తుందో, ఒకవేళ ఆయా దేశాల ప్రభుత్వాలో, ప్రభుత్వంలోని కీలక నాయకులో అందుకు అంగీకరించకపోతే వాళ్లని ఏయే మార్గాల ద్వారా దారిలోకి తెచ్చేవారో సవివరంగా చెప్పుకొస్తాడు ఈ పుస్తకంలో రచయిత.

ఇంతటి క్లిష్టమైన విషయాల గురించి రాసిన పుస్తకాన్ని నాటకంగా మలిచాడు రఘువీర్. ఒక్కరే ఇంట్లో కూర్చొని చదువుకోవడం వల్ల కలిగే కసి వల్ల ఉపయోగం లేదనుకున్నాడు కాబోలు. పదిమంది కళాకారులు కలిసి పుస్తకానికి జీవం పోస్తే ఆ సజీవ పుస్తకాన్ని కొన్ని వందల మంది ఉమ్మడిగా వీక్షిస్తే, ఆ వీక్షణ నుంచి ఒక సామూహిక చైతన్యం పుట్టుకొస్తే నాటక కళకి అంతకంటే పరమార్థం ఇంకేముంటుంది! రఘువీర్ ఈ నాటకంలో అదే పని చేశాడు. ఎం.ఎ. థియేటర్ ఆర్ట్స్ చదువుతున్న పదిమంది యువకుల్ని పోగేసి, వాళ్లచేత ఈ పుస్తకాన్ని చదివించి, అందులోని ప్రధానమైన భాగాలకు దృశ్యరూపం ఇచ్చాడు. రంగస్థలం వెనుక భాగంలో ప్రపంచ బ్యాంక్‌కి ప్రతీకగా ఒక పెద్ద సాలెగూడు వేలాడుతూ ఉంటుంది. సాలెగూటికి చిక్కాలేగాని ఇక తప్పించుకోవడం సాధ్యం కాదని ఆ ప్రతీక ప్రేక్షకులకు పదేపదే గుర్తుచేస్తూ ఉంటుంది. పుస్తకంలో లాగే నాటకం కూడా జాన్ పెర్కిన్స్ స్వగతంలో సాగుతుంది. జాన్ పెర్కిన్స్ తన జీవితం ఏమిటో, తన ఉద్యోగం ఏమిటో ప్రేక్షకులకు వివరించి, ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఒక్కో దేశానికి పయనమవుతూ ఉంటాడు. మిగిలిన నటీనటులందరూ ఆయా సందర్భాలలో వచ్చిపోయే పాత్రలుగా డిజైన్ చేశారు.

భారీ జీతం, ప్రమోషన్లు, కీర్తి ప్రతిష్టల వలయంలో చిక్కుకున్న పెర్కిన్స్ పాత్రలో ప్రారంభ సన్నివేశాలలో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించదు. తర్వాత తర్వాత అతని జీవితంలోకి ప్రవేశించిన వ్యక్తుల ప్రభావం వలన, వివిధ దేశాల సంస్కృతులు అక్కడి పేదరికం చూశాక పెర్కిన్స్‌లో ఒక తెలియని పశ్చాత్తాపం ప్రారంభం అవుతుంది. ప్రపంచ బ్యాంక్ అనే మహోన్నత సంస్థలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నాననే గర్వం నుంచి ఆ సంస్థ చేస్తున్న పాపంలో నా భాగస్వామ్యం కూడా ఉందే అన్న ఆత్మన్యూనతా భావం వైపు పెర్కిన్స్ పాత్ర ప్రయాణాన్ని అత్యంత ప్రతీకాత్మకంగా కళాకారులు సృజించగలిగారు. ఈ నాటకంలో పాల్గొన్న వాళ్లందరూ విద్యార్థులే! కొద్దిమందైతే కోర్సు చేరే ముందు వరకు కూడా నాటకం వేసిన వాళ్ళు కానీ, చూసిన వాళ్ళు కానీ కాదు.

తెలుగు నాటకం వెనుకబడి ఉండడానికి ఆర్థిక పేదరికమే కారణమని చాలామంది అంటూ ఉంటారు. అది పాక్షిక సత్యమే అని, ఆర్థిక వనరుల కంటే ఆలోచనల పేదరికమే అసలు సమస్య అని ఈ నాటకం నిరూపిస్తుంది. యూనివర్సిటీ వారిచ్చిన మూడువేల రూపాయల డబ్బుల్లో రఘువీర్ ఈ నాటకాన్ని రక్తికట్టించాడు. గంటకుపైగా సాగే నాటకంలో ఎక్కడా తెలుగు నాటకాల్లో కనిపించే ఒక్క రొటీన్ దృశ్యం కూడా లేకుండా జాగ్రత్తపడ్డాడు. జననాట్యమండలి, ప్రజానాట్యమండలి, అరుణోదయలాంటి సాంస్కృతిక సంస్థలు చేయాల్సిన నాటకాన్ని వాటితో ఏ సంబంధం లేని- బహుశా క్లాసులో తప్ప ఎప్పుడూ వాటి పేర్లు కూడా వినని- కుర్రకారు చేశారంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

యూనివర్సిటీల్లో ఉద్యోగాలు చేస్తూ ఏం పొడిచార్రా అని ఎవరన్నా అడిగితే ఏం సమాధానం చెప్పాలా అని ఇన్నాళ్ళూ కొంచెం గిల్టీగా ఉండేది. ఇప్పుడా బాధ తగ్గింది.

* పెద్ది రామారావు

రచయిత సెల్ నెం : 93910 05610
ramarao.peddi@gmail.com

“ఒక దళారీ పశ్చాత్తాపం” పుస్తకం విడుదలై దాదాపు అయిదేళ్లు కావొస్తోంది. ఇప్పటికి తొమ్మిది సార్లు పునర్ముద్రణ పొంది అమిత ప్రజాదరణ పొందిన ఈ అనువాద పుస్తక కథ గత వారం ఒక కొత్త రూపు తీసుకుంది.

తెలుగు యూనివర్సిటీలో ఎం.ఫిల్ చేస్తున్న రఘువీర్ వగ్గు ఈ పుస్తక కథ ఆధారంగా ఒక నాటకం రూపొందించారు. ప్రపంచ రంగస్థల దినోత్సవం పురస్కరించుకుని 26 మార్చి నాడు తెలుగు యూనివర్సిటీలో నందమూరి తారక రామారావు ఆడిటోరియంలో జరిగిన వేడుకల్లో భాగంగా యూనివర్సిటీ విద్యార్ధులు ఈ నాటకాన్ని ప్రదర్శించారు.

ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ నాటక ప్రదర్శన సభికులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ నాటక రంగ కళాకారులు శ్రీ చాట్ల శ్రీ రాములు గారు మాట్లాడుతూ ఒక దళారీ పశ్చాత్తాపం తనకు అత్యంత ఇష్టమైన పుస్తకమని. తాను స్వయంగా అనేక కాపీలు కొని తన మిత్రులకు పంచానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో శ్రీ దుగ్గిరాల సోమేశ్వర రావు గారు, తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీ భట్టు రమేశ్ గారు కూడా పాల్గొన్నారు.

నాటకంలో జాన్ పెర్కిన్స్ పాత్రను పోషించిన తిరుపతి రెడ్డి ఆ పాత్రలో జీవించాడు. ఇతర పాత్రల్లో నటించిన నటీ నటులు కూడా చక్క గా నటించారు.

ఆ ప్రదర్శన తాలూకు పత్రికా కధనాలు కింద చూడొచ్చు.

ఈనాడు దినపత్రిక

ఆంధ్రజ్యోతి దినపత్రిక

వార్త దినపత్రిక