ఒక దళారీ పశ్చాత్తాపం విజయానికి ప్రధాన కారణం జాన్ పెర్కిన్స్ రచనా శైలి. సాధారణంగా ప్రపంచీకరణకు సంబంధించిన పుస్తకాలు కాస్త గొట్టు భాషలో ఉంటాయనే అభిప్రాయం ఉంది పాఠకుల్లో. దాన్నిపటాపంచలు చేస్తూ సరళమైన భాషలో రాసిన ఈ ఆత్మకథ పాఠకులను అమితంగా ఆకట్టుకుంది. ప్రపంచ బ్యాంక్ ప్రయోగశాలగా పేరుగాంచిన ఆంధ్ర ప్రదేశ్ లో సహజంగానే ఆ బ్యాంక్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కాస్త ఎక్కువే. ప్రపంచ బ్యాంకుకు ఏజెంటులా పని చేసి ఇప్పుడు ఆ గుట్టు మట్లన్నీ పూసగుచ్చినట్టుగా వివరించిన జాన్ పెర్కిన్స్ పుస్తకం అందుకనే ఇక్కడ ఇంతగా ప్రజాదరణ పొందింది.
పుస్తకం అనువాదం నుండి మొదలుకుని ప్రూఫ్ రీడింగ్ వరకూ దగ్గరుండి అన్నీ చూసిన వేణు, పుస్తకాన్ని అచ్చుకు ముందే చదివి ప్రోత్సాహించిన రాంకీ, వనజ; మొదటి ప్రతిని చదివి వెంటనే ఫోన్ చేసి అభినందించిన సీనియర్ పాత్రికేయులు వి. హనుమంత రావుగారు, జైల్లో నుండే పుస్తకాన్ని చదివి చక్కని సమీక్ష రాసిన వరవరరావు గారు, ఆంధ్రజ్యోతిలో గొప్ప సమీక్ష రాసి పుస్తక విజయానికి బాటలు వేసిన ప్రకాష్ గారు, ఇంకా అనేక పత్రికల్లో సమీక్షలు రాసిన రచయితలు; వీక్షణం స్టాఫ్ రాము, కిషోర్…ఇలా ఈ విజయానికి కారకులెందరో…అందరికీ వినమ్ర వందనాలు.
అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే వాళ్లంటే చాలా మందికి (నాతో సహా) ఒక స్టీరియోటైప్ రూపం మదిలో ఉంటుంది. అయితే ఈ పుస్తకం విడుదల అయ్యాక నాకు అర్థం అయ్యింది ఏమిటంటే సామ్రాజ్యవాద వ్యతిరేకులు వివిధ రూపాల్లో ఉంటారని. పుస్తకం చదివి నాతో తమ అనుభవాలు పంచుకున్న వారిలో గుడి పూజారి మొదలుకొని పోలీస్ ఇన్స్పెక్టర్ వరకు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, రచయితలు, రాజకీయ నాయకులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, జర్నలిస్టులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, యువజన సంఘాల సభ్యులు, ప్రవాసాంధ్రులు, సామాజిక కార్యకర్తలు, సమాజాన్ని బాగు చేయడం కొరకు వివిధ రూపాల్లో పోరాటం చేస్తున్న వారు …ఇలా అన్ని రంగాల ప్రజలు ఉన్నారు.
గ్లోబలైజేషన్ ముసుగులో ధనిక దేశాలు పేద దేశాలను ఎలా పీల్చిపిప్పి జేస్తున్నాయో చెబితే ఇదివరకు చాలా మంది అపనమ్మకంగా చూసేవారు. కానీ ఇప్పుడీ పుస్తకం పుణ్యమా అని ఎటువంటి రాజకీయాభిప్రాయాలు లేని ప్రజలకు కూడా గ్లోబలైజేషన్, ప్రపంచ బ్యాంకుల కుట్రల గురించి తెలిసిపోయింది.
రెండు నెలల కిందట ఒక బంధువును కలిసే పని మీద తెలుగు యూనివర్సిటీకి వెళ్లాను. అక్కడ హాస్టల్ రూములో వేచి చూస్తున్న నాకు బుక్ షెల్ఫ్ లో “ఒక దళారీ పశ్చాత్తాపం” పుస్తకం కనపడింది. ఎలెక్ట్రిక్ హీటర్ పైన వంట చేస్తున్న ఆ రూములోని అబ్బాయిని అడిగాను “ఈ పుస్తకం చదివావా?” అని. ఇరవై యేళ్లుంటాయేమో ఆ కుర్రాడికి. చేస్తున్న పని ఆపి వచ్చి ”చాలా బాగుంది సార్ పుస్తకం. ఇటువంటి విషయాల గురించి ఇదివరకు నాకు ఏమీ తెలవదు. చాలా ఈజీగా అర్థమయ్యేటట్లు రాసిండ్రు. మా హాస్టల్లో చాలామందిమి చదివాం సార్” అన్నాడు ఉత్సాహంగా.
ఆ పుస్తకం తెలుగులోకి అనువాదం చేసింది నేనేనని చెబితే ఆ పిల్లవాడు పరుగున వచ్చి షేక్ హాండిచ్చాడు. అతగాడి కళ్లలో ఆనందం వర్ణనాతీతం.
అటువంటి సంఘటనలు జరిగినప్పుడెల్లా నాకు ఒక సామాజిక బాధ్యత నెరవేర్చినందుకు సంతృప్తి కలుగుతుంది. దానితోపాటే చెయ్యాల్సింది ఎంతో ఉందనే బాధ్యత కూడా గుర్తొస్తుంది. మనమొక వైపు జరిగిన విధ్వంసం గురించి తెలుసుకుంటుంటే మరొక వైపు గ్లోబలైజేషన్ రధ చక్రాలు సామాన్య ప్రజలను నలిపేస్తూనే ఉన్నాయి. సెజ్ ల పేరిట దేశవ్యాప్తంగా జరుగుతున్న భీభత్సం సామ్రాజ్యవాదానికి ఒక కొత్త కోణం.
మన భావాలు, నమ్మకాలు ఏమైనా కావచ్చు. కానీ సామ్రాజ్యవాదం మన ఉమ్మడి శత్రువు. అందుకే మనందరం కలిసికట్టుగా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం చెయ్యాల్సిన తరుణమిది. పెర్కిన్స్ చెప్పినట్టు మనకోసం కాకపోయినా మన పిల్లలకు ఒక మెరుగైన సమాజం అందించడానికైనా ఈ పోరాటం చేయలి.
- కొణతం దిలీప్
ఏప్రియల్ 29, 2008 at 8:40 పూర్వాహ్నం
[...] ఒక దళారీ పశ్చాత్తాపం విడుదలై రెండేళ్లలోనే ఆరు సార్లు పునర్ముద్రణ పొందిన సందర్భంగా నా భావాలు ఇక్కడ రాశాను. [...]
ఏప్రియల్ 29, 2008 at 11:04 పూర్వాహ్నం
విడుదలైన రెండేళ్లలో ఒక అనువాద పుస్తకం ఆరు సార్లు పునర్ముద్రణ పొందడం చిన్న విషయం కాదు.
ఒక అనువాదకుడిగా ఆ ఆనందం ఏమిటో నాకు తెలుసు. మంచి పుస్తకాన్ని అనువదించిన మీకు నా అభినందనలు
కొల్లూరి సోమ శంకర్
ఫిబ్రవరి 10, 2009 at 7:23 అపరాహ్నం
దిలీప్ గారూ ,చాలాబాగుంది మీ అనువాదం,మంచిపుస్తకాన్ని అందించారు. ధన్యవాదాలు